Sri Devi Bhagavatam-1
Chapters
ఆర్షభారతి - పురాణ వాఙ్మయము భారతీయుల చిత్తప్రవృత్తు లెప్పుడును వైహికములయందు కంటె ఆముష్మిక విషయములందే సాగుచుండుట పరిపాటి. అందులకు తగినట్లుగనే వేదములు పురాణాదికములు సర్వధర్మములను నుపదేశించియున్నవి. ఐహి+కాముష్మిక సుఖముల చేకూర్చు ధర్మములను బోధించుటయే ఆర్షభారతికి ప్రధాన లక్ష్యము. వేదములు మొదలుకొని కావ్యములవరకుగల సమస్త వాఙ్మయము ఈ దృష్టితోనే ప్రవర్తిల్లి సకల శ్రేయస్సంధాయకమై యలరారుచున్నది. ఐహికాముష్మికములగు సర్వ సుఖములను మానవ సమాజమునకు సమకూర్చుటలో శ్రుతులు (వేదములు) స్మృతులతోపాటు పురాణములకుకూడ ప్రాధాన్యమున్నట్లు ఆర్షవచనములు ఛాందోగ్య బృహదారణ్యకాది శ్రుతి వచనములు గూడ నుద్ఘోషించుచున్నవి. సృష్టికి పూర్వదశలో నారంభించి లయమువలకుగల స్థితిగతులను అభివర్ణించుచు పురాణతిహాసములు ప్రత్యక్షే ణానుమిత్యా వా యస్తూపాయో న బుధ్యతే | ఏతం విద న్తి వేదేన తస్మా ద్యేదస్య వేదతా || అనినట్లుప్రమాణాంతరా%నధిగతా%బాధితార్థ బోధకములగు వేదములవలె ధర్మాదులను బోధించుటలో పరమ ప్రమాణములై శిరోధార్యము లగుచున్నవి. ఇతిహాస లక్షణములు కొన్ని భాగవతాది పురాణములందును పురాణ లక్షణములు కొన్ని భారతా దీతిహాసము లందును పొడసూపుచున్నను ఇతిహాస మను పేరు భారతేతిహాసమునకును పురాణములను వ్యవహారము భాగవతాదులకును ప్రసిద్ధమై యొప్పుచున్నది. మఱియు అష్టాదశ పురాణానాం నామధేయాని యః పఠేత్ | త్రిసంధ్యం జపతే నిత్యం సో%శ్వమేధ ఫలం లభేత్ || అని వేదవ్యాసులు మార్కండేయ పురాణమునందు చెప్పుచు ''యం యం క్రతు మధీతే తస్య తస్యేష్టం భవతి'' అనగా ఆయా యాగ ప్రతిపాదక వేదభాగ పారాయణము చేసిన వానికి ఆయా క్రతు సమాచరణము వలన కలుగు ఫలము చేకూరునని చెప్పినట్లు పదునెనిమిది పురాణ నామధేయములను త్రిసంధ్యలందు జపించుటచే అశ్వమేధ యాగానుష్ఠాన ఫలము సిద్ధించునని చెప్పిరి. దీనివలన వేదములవలె పురాణతిహాసములు కూడ పరమ పవిత్రములని తెలియుచున్నది. ఇంతియేకాక ''ఇతిహాస పురాణాఖ్యాం వేదం సముప బృంహయేత్'' అనగా ఇతిహాస పురాణములను చక్కగ పఠించి వీని యాధారమున వేదార్థమును చక్కగ వివరింపవలెను అనియు ''బిభే త్యల్పశ్రుతా ద్వేదో మా మయం ప్రహరేదితి'' అనగా పురాణతిహాసముల నెఱుంగని అత్యల్ప పాండిత్యము గలవానిని చూచి వేదము నన్ను ఇతడు పాడు చేయునని భయపడును అనియు చెప్పుటచే పురాణాదులకుగల ప్రాముఖ్యము ప్రామాణ్యము గోచరించుచున్నవి. దానిని బట్టి ఆయా శాస్త్రముల నధ్యయనము చేయుటతోపాటు ఇతిహాసాదికమును గూడ సరిగ నధ్యయనము చేసి వాని తాత్పర్యమును శాస్త్రబలముచే చక్కగ గ్రహించి వీని తోడ్పాటుతో వేదప్రతిపాదితార్థమును పోషింపవలెను అని తేలుచున్నది. శ్రుతులు స్మృతులు పురాణములు ఇతిహాసములు శ్రవ్య దృశ్య కావ్యములు ధర్మమును ప్రతిపాదించుటయందు సమానయోగ్యత కలవై యుండవచ్చును. కాని బోధించుటలో భేదము గలదు. శ్రుతులు ప్రభు సమ్మితములై శాసనరూపమున ధర్మబోధనము చేయును. కాని వివరముగ చెప్పవు. వేదములు శబ్దప్రధానములు గదా! పురాణాదు లట్లు గాదు. అవి అర్థప్రధానములు. కావున మిత్రు డొకడు తన మిత్రునకు మంచిని చెప్పుటలో నవలంబించు రీతి నవలంబించి ధర్మాధర్మముల వలన కలుగు బాగోగులను దృష్టాంత ప్రదర్శన పూర్వకముగ రామాదులవలె ధర్మ మాచరించి బాగుపడుము, రావణాదులవలె అధర్మమాచరించి చెడిపోకుము అని వివరణ పూర్వకముగ నచ్చచెప్పగలుగును. అందువలన ధర్మమందు ప్రవృతి అధర్మమునుండి నివృత్తియు సుకుమార పద్ధతిలో కలుగును. పురాణములు సర్వజన సమాదరణీయము లగుటలో మఱియొక కారణముగూడ గలదు. వేదవాఙ్మయమునగల భాష సంస్కృతమే అయ్యును లౌకిక సంస్కృతముకంటె ననేక రీతులుగ క్లిష్టతరమై యున్నది. సంప్రదాయ శుద్ధముగ దానిని గురువు నొద్ద నధ్యయనముచేసి తీరవలయును. వేదములకు అంగములయిన శిక్షావ్యాకరణాది షడంగములను చదువవలెను. మీమాంసాశాస్త్రమును చదువవలెను. ఇంత కృషి చేయనిదే తదుక్తమగు నర్థము అవగతము కాదు. పురాణము లట్లుగాక సులభగ్రాహ్యమైన సంస్కృత భాషలో సులభమగు శైలిలో ఆయా విషయములను ధర్మములను కథాముఖమున బోధించును. కావున సర్వజన సమాదరణీయము లగుచున్నవి. ఈ కాలమందు పురాణగతమైన సులభతమ సంస్కృతముగూడ కాలప్రభావముచే నర్థము చేసికొను శక్తిగూడ లేకుండుటచే నివి తెనుగు భాషలోనికి అనువదింప నావశ్యకత యేర్పడినది. పురాణ శబ్దార్థము: 1. పురాభవం=పురాతనం-అనగా పూర్వము జరిగినది అను నర్థములో పురాణ అని చెప్పవలెను. 2. పురాపి నవం=పురాణమ్ ఎప్పుడును క్రొత్తగ నుండునది. పురానవ-లో వర్ణలోపము. 3. పురా అను అవ్యయమునకు మునుపు అను అర్థముతోపాటు ముందు అను నర్థముకూడ గలదు. ఇక ముందుండునది అని అర్థము. అనగా సృష్టికి పూర్వపు స్థితితో నారంభించి రాబోవు విషయములను గూడ తెలుపుచుండుట అన్ని పురాణములందును గలదు. దీనికి తగినట్లు పురాణ లక్షణ మిట్లు చెప్పబడినది : ''సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ| భూమ్యాదేశ్చైవ సంస్థానం పురాణం పంచలక్షణమ్||'' ఈ శ్లోకపు మూడవ పాదమునకు ''వంశాను చరితం చైవ'' అనునది పాఠాంతరముగ అమరకోశ వ్యాఖ్యానము ''సుధ''లో గలదు. 1. సర్గము = సృష్టి. పరమాత్మ యొక్క మాయా విలాసముచేత అవ్యాకృత తత్త్వము-దానినుండి మహత్తత్త్వము-దానినుండి అహంకారము- దానినుండి సూక్ష్మభూతములు జనించుట. 2. ప్రతి సర్గము-హిరణ్యగర్బుడు అను ప్రథమ జీవునియొక్క మానస పుత్రులైన మరీచ్యాది ప్రజాపతుల వలన జరిగిన చరాచరభూత సృష్టి. 3. వంశము = ప్రజాపతులనుండి సృష్టిక్రమములో సాగిన ఆయా ఋషుల రాజుల వంశములు. 4. మన్వంతరములు = స్వాయంభువుడు మున్నగు మనువులు వారివారి పాలనలోగల విషయములు ఆయా మన్వంతరములలోని సప్తర్షులు ప్రధాన మునులు మున్నగు వారిని గూర్చిన విషయముల ప్రతిపాదనము. 5. భూమ్యాది సంస్థానమ్ = భూగోళ విభాగము- ఆయా వర్షములలోని ఖండములలోని- ప్రధాన పర్వత సముద్ర నద్యాదికము- భారతవర్షములోని నదీపర్వత సముద్రాది వర్ణనములు తీర్థములు క్షేత్రములు మొదలగువాని మహత్త్వ ప్రతిపాదనము అవతార వృత్తాంతములు. వంశాను చరితము - ఈ పాఠాంతరమును బట్టి ఆయా రాజవంశములలో జనించిన రాజుల పాలనాదికముల గూర్చిన కథలు. రెండవ పాఠము గ్రహించుట వలన ''జన్మాద్యస్య యతః'' (బ్ర. సూ. 1-1-2) అను సూత్రములో ప్రతిపాదించిన ఔపనిషద బ్రహ్మ తటస్థ లక్షణమే పురాణ ప్రతిపాదిత పరబ్రహ్మముయొక్క లక్షణము అని విద్యారణ్యులు చెప్పిన వచనము సార్థక మగును. పురాణములు-మహా పురాణములు 18 ఉప పురాణములు 18 అని రెండు విధములు. మహా పురాణములు : శ్లో|| మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయమ్ | అనాప కూస్క లింగాని పురాణాని పృథక్ పృథక్ || నారద పురాణానుసారి మత్స్యపురాణానుసారి అధ్యాయ సంఖ్య శ్లో. సం శ్లో. సం 1. బ్రహ్మపురాణమ్ 10000 13000 245 2. పద్మ 55000 55000 641 3. విష్ణుపురాణమ్ (విష్ణు ధర్మోత్తరముతో)23000 23000 127 4. శివ 24000 24000 464 5. దేవీ భాగవత 18000 18000 332 6. నారదీయ 25000 25000 207 7. మార్కండేయ 9000 9000 134 8. అగ్ని 16000 15000 383 9. భవిష్య 14000 14500 605 10. బ్రహ్మవైవర్త 18000 18000 266 11. లింగ 11000 11000 160 12. వారాహ 24000 24000 218 13. స్కాంద 81100 81000 1671 14. వామన 10000 10000 25 15. కూర్మ 17000 18000 99 16. మత్స్య 15000 14000 290 17. గరుడ 19000 18000 318 18. బ్రహ్మాండ 12000 12200 161 ఉప పురాణములు : 1. సనత్కుమారము 2. నారసింహము 3. నారదము 4. శైవము 5. దౌర్వాసము 6. కాపిలము 7. మానసము 8. ఔశనసము 9. వారుణము 10. కాశికము 11. సాంబము 12. నందికృతము 13. సౌరము 14. పారాశరము 15. ఆదిత్యము 16. మహేశ్వరము 17. శ్రీమద్భాగవతము 18. యోగ వాసిష్ఠము. వీనిలో మహాపురాణములలో ఉన్న పేర్లే కొన్ని కనబడుచున్నవి. వీని విషయములలో కలుగు సందేహములు సంప్రదాయజ్ఞుల వలన తీర్చుకొనవలసి ఉండును. మహాపురాణము లన్నియు శివుని గాని విష్ణుని గాని పరమదైవతముగ ప్రతిపాదించుచున్నవి. ప్రస్తుత శ్రీదేవీ భాగవతము మాత్రము శ్రీశక్తి తత్త్వమును పరమార్థ తత్త్వముగ ప్రతిపాదించుచున్నది. ఈ శక్తితత్త్వము పరమాత్మ తత్త్వముతో అవిభాజ్యమగు ఇచ్ఛా శక్తిరూపమైనది. కావున శివకేశవుల భేదభావనకు నేమాత్రము నాస్పదముకాని పరమాత్మ తత్త్వమే శ్రీదేవీ భాగవతములో ప్రతిపాదింపబడినది. పురాణములు గుణభేదము ననుసరించి సాత్త్విక రాజస తామస బేధమున విభజింపబడినట్లు సంప్రదాయజ్ఞులు చెప్పుచున్నారు. ఈ విషయమున గ్రహింపబడిన గుణత్రయము పరమాత్మ సృష్టి స్థితి లయములను నిర్వహించుటకై మూర్తిత్రయమందు నిలిపిన ప్రవృత్తి నివృత్త్యానందరూపములగు గుణత్రయమే కాని సుఖ రాగ మోహ రూపములగు లౌకిక సత్త్వరజస్తమో గుణములు కావు. పురాణములకన్నిటికి కర్త శ్రీ వేదవ్యాసమహాముని అని సంప్రదాయసిద్ధమైన విషయము. ''అష్టాదశ పురాణానాం కర్తా సత్యవతీ సుతః'' అని చెప్పబడిన శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాస భగవానుడు ఈయనయే. ఈ మహాముని వీనిని రచించిన ప్రదేశము భూలోకమున మొట్టమొదటి విద్యాపీఠమగు శ్రీ బదరికాశ్రమము. అందు మొదటి గురుశిష్యులు ధర్ముని పుత్రులగు శ్రీ నరనారాయణులు. ఈ విషయములను స్ఫురింపజేయుటకే శ్రీ వేదవ్యాసులు శ్రీ భారతేతిహాసారంభమునను పురాణముల యారంభమునను. ''నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ | దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీరయేత్ || నరోత్తములగు నరనారాయణులను శ్రీ సరస్వతీ దేవిని నమస్కరించియే జయ మను పేర నేను రచించిన పురాణతిహాసములను ప్రవచింపవలెను అని శిష్యుల నాదేశించినారు. ఈ శ్లోకమున పేర్కొనిన ఆ సరస్వతీదేవియే కాశ్మీరములోని శ్రీ శారదాదేవి యనియు పిమ్మట శ్రీశంకర భగవత్పాదులచే ఆయా శృంగేర్యాది జగద్గురు పీఠములలో ఆరాధనీయగ ప్రతిష్ఠితయైన శ్రీ శారదా పరాభట్టారిక యనియు యూహింపనగును. జయశబ్దము సూచించు అర్థము-పురాణముల సందేశము వేదశాస్త్రములు విధించిన సత్కర్మముల నాచరించి యిహపర సుఖములను చిత్తశుద్ధి ద్వారా జ్ఞానమును మోక్షమున సంపాదింపవలెననునది పురాణాదులు అందించు సందేశము. ఈ అంశమును పైశ్లోకములోని 'జయ' శబ్దము సూచించుచున్నది. జయ శబ్దమును త్రిప్పి చదివిన యజ అగును. యజ-పూజాయాం అను ధాతువు వలన (దేవతలను) పూజింపుము అని అర్థము. ఇజ్యతే=యజింపబడువాడు=విష్ణువు. ''యజ్ఞో వై విష్ణుః'' అను వాక్యమునుబట్టి యజ్ఞములలో నారాధనీయ ప్రధాన తత్త్వము ప్రజాపతి సప్తదశ దేవతాత్మకము. ఈ తత్వమును శ్రుతి 1. ఆశ్రావయ (4 అక్షరములు) 2. అస్తు శ్రౌషట్ (4 అ.) 3. యజ(2 అ.) 4. యే యజామహే (5 అ) 5. వషట్ (2 అ) అను నక్షరములతో సంకేతించుచున్నది. ఈ శ్రౌత ప్రజాపతిని ఆరాధించుట ద్వారా ఆరాధింపబడు ప్రధాన తత్త్వము శ్రీ మహావిష్ణువే. ఈ అంశమును ''చతుర్భిశ్చ చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభి రేవచ | హూయతే చ పున ర్ద్వాభ్యాం స మే విష్ణు ప్రసీదతు ||'' 4+4+2+5+2=17 అక్షరములు గల ఆశ్రావయేత్యాది వాక్యములచే 'హోమము చేయబడు విష్ణువు నన్ను అనుగ్రహించు గాక!' అని మహా భారతమున శ్రీ వేదవ్యాసులు చెప్పినారు. ఈ అంశము శ్రీమద్రామాయణమున అరణ్యకాండములోకూడ చెప్పబడినది. మానవు లాయా దేవతల నుద్దేశించి ''అగ్నిముఖము''న నిచ్చు ఆజ్యాది హవిస్సు నందుకొని దేవతలు సంతృప్తులై పర్జన్యుని ద్వారా వర్షింతురు. సోము డనుగ్రహించి ఓషదులను ఫలింపజేయును. వానివలన అన్న సిద్ధియు దానివలన ప్రాణుల అభివృద్ధియు జరుగును. ప్రాణశక్తి రూపుడగు అగ్ని హవిస్సును హుతముచేసి దాని సారమును దేవతలకు ఆహారముగ నందించును. సోముడు ఓషధిరూపమున పరిణమించి ప్రాణకోటికి ఆహారమును సమకూర్చును. ఈ విధముగ అగ్నీషోములు అత్త అన్నము (తినువాడు తినబడునది) అను రెండు రూపములలో లోకప్రవృత్తికి కారణభూతములగుచున్నారు. ఇట్లు అగ్నీషోమీయ తత్వము విరాట్పురుషుని దేహమునందు ప్రధానాంశ మగుచున్నది. ఈ తత్వము కొంత నిగూఢముగ శ్రుతులలోను పురాణతిహాసములలోను చెప్పబడినది. (చూ. బృహ. అ. 4-256). ఈ విధముగ ప్రాణులకు యోగక్షేమముల సమకూర్చునట్టి యజ్ఞ తత్వము నెఱింగి యజ్ఞము లవశ్య కర్తవ్యములను సందేశ##మే జయపదములో నిమిడియున్నది. మఱియు అక్షరములు సంఖ్యలను సూచించుకాదినవేత్యాది సంప్రదాయము ననుసరించి జ=8, య=1 అని సంకేతము. ఇది అంకానాం వామతో గతిః అను వాక్యమును బట్టి=18=అగును. ఇది వ్యాస రచితములైన పురాణముల సంఖ్యను గూడ సూచించుచున్నది. పురాణములు భగవదుపాసనా సోపానములు పురాణములు పరమేశ్వరుని దృశ్య ప్రపంచాత్మక స్వరూపమును సమగ్రముగ వివరించును. దీనినే విరాట్ స్వరూపమని శ్రుతులు శాస్త్రములు పురాణములు పేర్కొనుచున్నవి. ఈ విరాట్ స్వరూపోపాసనము పరమాత్మ నుపాసించుటకు మార్గమనియు ఆ స్వరూపమును ప్రతిపాదించు వాఙ్మయమును అధ్యయనము చేయుట శబ్దాత్మక పరబ్రహ్మోపాసనమే అనియు శ్రీమద్భాగవత ద్వితీయ స్కంధము తెలుపుచున్నది. పురుష సూక్త రుద్రాధ్యాయ విష్ణు సహస్రనామ స్తోత్రాదులు విరాట్ స్వరూపమును ప్రతిపాదించుచు ఉపాసకులకు మోక్ష సాధనములుగ నాలుగు ఆశ్రమములవారి చేతను నుపాసింపబడుచున్నవి. శ్రీదేవీ భాగవతము శ్రీదేవీ భాగవతము అష్టాదశ మహాపురాణములలో నొకటిగ శిష్ట పరంపరచే నాదరింపబడుచున్నది. ఇందు మహా పురాణ లక్షణము లెక్కడ నే విధముగ ప్రతిపాదితములను విషయము శ్రీదేవీ భాగవత ప్రథమ స్కంధములో విశదీకరింపబడినది. భగవతికి సంబంధించిన తత్త్వమును బోధించున దగుటచే భాగవత మని ఈ పురాణమునకు పేరు. ఆ భగవంతి శ్రీదేవియే. ఆమె పరమాత్మతత్త్వముతో అభిన్నము. ఆ తత్త్వముతో నిత్యానపాయినిగా ఎన్నడు వేఱుకాక యుండు తత్త్వమే ఆమె. ఆమె ఆది మధ్యాంతములు లేనిది. నాటినుండి నేటివరకు నుపాసకులు ఈ పరతత్త్వము నదే భావనతో ఉపాసించుట పరిపాటిగనున్నది. ఉపనిషత్తుల ననుసరించి శ్రీగౌడపాదాచార్యులును శ్రీశంకర భగవత్పాదులును ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతమునకు వివర్తాద్వైతమనియు తాంత్రికులు పరిగ్రహించిన శ్రీదేవ్యుపాసనాపరమగు అద్వైత సిద్ధాంతమునకు పరిణామాద్వైత మనియు వ్యవహారము. వివర్తాద్వైత సిద్ధాంతమును పరమార్థముగ గ్రహించిన ఔపనిషద సంప్రదాయము వారికి కూడ ఈ పరిణామాద్వైతము సాధనరూపమగు నుపాసనముగా నన్ని విధముల నుపయోగపడునని శ్రీ బ్రహ సూత్ర భాష్యములో శ్రీశంకర భగవత్పాదులును సంక్షేప శారీరకములో సర్వజ్ఞాత్మ మునులును మఱికొందరు పెద్దలును చెప్పియున్నారు. ఈ విధముగ నన్ని శ్రేణుల వారికి నుపాదేయమయిన శ్రీదేవ్యుపాసనమును శ్రీదేవీ భాగవతము శాస్త్రీయ విషయములతో కథారూపములగు నుదాహరణములతో తెలుపుచు శ్రీదేవీ మహిమమును నెల్లరకును సులభగోచరమగు రీతిగ చేయుచున్నది. మఱియొక విషయము-శ్రీగాయత్రీ మహామంత్రములో శుద్ధ పరతత్త్వము ప్రతిపాదింపబడియున్నది. శ్రీగాయత్రి మహామంత్రమును దానిచే ప్రతిపాదింపబడు పరమార్థతత్త్వమును నుపాసించుట వలన పరమార్థసిద్ధి కలుగుటయు శాస్త్రములోను అనుభవములోను గోచరించుచున్నది. శ్రీదేవీ తత్త్వోపాసనాద్వారభూతములగు మహామంత్రము లనేకములు కలవు. ఆ మహామంత్రములన్నియు వేదమాతయగు శ్రీగాయత్రీ మహామంత్రమునకు రూపాంతరములే యని శ్రీభాస్కరరాయల వంటి మహాతత్త్వవేత్తలు వచించిరి. మహామంత్రములకు కొన్నిటికి మూలభూతములగు బీజాక్షరములుగ నున్న వాగ్బీజము కామరాజబీజము భువనేశ్వరీ బీజము నవార్ణమంత్రము మున్నగువానిని గూఢముగను ప్రకటముగను శ్రీదేవీ భాగవతము ప్రతిపాదించుచున్నది. ఇంతియకాక ప్రాసంగికముగ ననేక పుణ్యకథలను దేవీ భాగవతము చెప్పుచు ఉపాసకుల చిత్తశుద్ధికిని వృద్ధికిని ఇహపర ఫలసిద్ధికిని దోహద మొనరించుచున్నది. మరియు నృసింహ తత్వము తన్మంత్రము తన్మహిమము నారాయణుని పరదేవతగా గ్రహించిన మరికొన్ని మంత్రములు అచ్చటచ్చట ప్రతిపాదితములై సర్వదేవతోపాసనమును సాధకులకు నందజేయుచు నీ గ్రంథము మహోపకృతి గావించుచున్నది. శ్రీదేవ్యుపాసనా సంప్రదాయమునందు శ్రీచండీ సప్తశతికి భారతదేశమునందే కాక శ్రీదేవీతత్త్వ మెఱింగిన విదేశీయుల హృదయములలో గూడ స్థానము గలదు. సప్తశతిలోని అన్ని అంశములు అనగా-సప్తశతిలోని ప్రథమ మధ్యమోత్తమ చరితములలోని అన్ని అంశములు మూలగ్రంథములో కంటె విస్తృతముగ నీ గ్రంథపు ప్రథమ పంచమ స్కంధములలో ప్రతిపాదింపబడినవి. మఱియు బ్రహాండ పురాణాంతర్గత శ్రీలలితోపాఖ్యానమునందుగల శ్రీదేవి యొనరించిన శుంభ నిశుంభాసుర వధ వృత్తాంతము ద్వారా శ్రీదేవీ తత్త్వమంతయు ప్రతిపాదింపబడినది. ఆ విషయ మంతయు శ్రీదేవీ భాగవతమున సరళముగను లలితముగను ప్రతిపాదింపబడినది. ఇదికాక శ్రీదేవీ భాగవతమునందు బ్రహ్మసూత్రములు ఉపనిషద్వచనములు ఉన్నవి ఉన్నట్లుగ ఆయా కథా ప్రసంగములందు తదనుగుణముగ శ్లోకరూపమున నిముడ్చబడినవి. ఏకాదశ ద్వాదశ స్కంధములందు శ్రీగాయత్రీ మహాదేవికి సంబంధించిన యన్ని విషయములు సహస్రనామ స్తోత్రాదికము కవచము పంజరము హృదయము మున్నగు శ్రీగాయత్య్రుపాసనమునకు వలయు సర్వసామగ్రియు అనుగ్రహింపబడినది. ఉపాసకుల కర్తవ్యమును స్ఫురింపజేయుచు ప్రారంభమున ప్రథమ శ్లోకము గాయత్రీ ఛందస్సులో రచింపబడినది. శ్రీ దేవీ భాగవతమున భాగవత లక్షణము శ్రీగాయత్రీ తత్త్వము నాలంబనముగ తీసికొని ధర్మ విస్తృతిని వర్ణించుటయు వృత్రాసుర వధ ప్రసంగమును భాగవత లక్షణమని మత్స్య పురాణమున చెప్పబడినది: యత్రా7ధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తరః | వృత్రాసుర వధోపేతం తద్భాగవత మిష్యతే || ఈ విధమగు అనే కాంశములు ఈ దేవీ భాగవతమునందు ప్రతిపాదింపబడినవి. శ్రీదేవీ తాత్త్వికరూపము ఏదేవతోపాసనకైనను ఉపాసకులు ఆదరింపవలసిన దేవతారూపములు మూడు గలవు. అవి స్థూలరూపము సూక్ష్మరూపము పరమ తాత్త్వికరూపము. వీనిలో స్థూలరూపము ఉపాసకులకు సులభముగ అందుబాటులో నుండును. ఈ రూపమున కరచరణాదులు పరికరములు వానిని పూజించుటకు షోడశోపచారాదులు ఆవశ్యకములు. ఇట్లు ఆరాధించు పద్ధతిని బహిర్యాగ మందురు. ఇక సూక్ష్మరూప విషయము: ఆయా దేవతలకు సంబంధించిన మంత్రములే వాని సూక్ష్మరూపములని శాస్త్ర వ్యవహారము. శ్రీదేవికి సంబంధించిన అనేక మంత్రములలో ముఖ్యములైన వాగ్బీజము కామరాజ బీజము భువనేశ్వరీ బీజము మొదలైనవి నవార్ణమంత్రము వీని మహిమము శ్రీదేవీ భాగవతములో కథారూపములో చక్కగా ప్రతిపాదింపబడినవి. ఆయా దేవతల తత్త్వమంతయు సంక్షిప్తముగ వీనిలో నిమిడియుండుటచేత ఆయా దేవతల మంత్రములు ఆయా దేవతల సూక్ష్మరూపమని వ్యవహారము. దేవతల యీ సూక్ష్మరూపమును జపాది రూపమున నుపాసించుటయే అంతర్యాగమున నొక సోపానము. ఇది పైని చెప్పిన బహిర్యాగముకంటె ఉత్కృష్టతరమైనది. ఇక పరరూప విషయము: వాక్కులకు మనస్సునకు అందనిదై అనుభూతిలో మాత్రము గోచరించునదియు ఉపాసకులకు జీవన్ముక్తి దశను కలుగజేయునదియు జీవన్ముక్తులకు సర్వదా అనుభవములో గోచరించునదియు నగు పరతత్త్వపు సూక్ష్మతమ రూపమునకు పరరూపమని వ్యవహారము. శ్రీదేవీ పరరూపము శ్రీదేవీ భాగవతములోనేకాక శ్రీదేవ్యుపాసనాపరములైన అన్ని గ్రంథములలోను నొకే విధముగ నిరూపింపబడినది. ఈ పరతత్వ రూపముతో వేరుగాక కలిసియుండి సృష్టి స్థితి లయ తిరోధా నానుగ్రహము లనెడి పంచకృత్యములను నిర్వహించు పరమశక్తియే మూలతత్త్వము. ఆమె లేనిదే విశ్వమం దేదియు లేదు. విశ్వమే లేదు. ఆ తల్లి యొక్క పరిణామమే యీ విశ్వము. విశ్వమందలి ప్రతి అణువు ఆ తల్లి రూపమే. ఈ విషయమే క్షేమరాజ భగవానుడు ''చితిః స్వతంత్రా విశ్వసిద్ధి హేతుః'' అని చితి స్వరూపశక్తియే అన్యాపేక్షలేకుండ స్వతంత్రముగ విశ్వముగా రూపొందుటకు కారణ మగుచున్నట్లు చెప్పెను. ఈ విషయమును శ్రీశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ప్రతిపాదించియున్నారు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని శక్తి మూడు విధములు. సృష్టి జరుగుటలో మొట్టమొదట పరతత్త్వములో కలుగు ప్రథమ స్పందనమే ఇచ్ఛాశక్తి రూపము. ఇదియే సృష్టి చేయుటకై చేయు భగవానుని సంకల్పము. విశ్వ నిర్మాణమునకై కావలసిన సామగ్రీ సంపాదనమునకై చేయు వ్యాపారమే జ్ఞానశక్తి. ఆ నిశ్చయానుసారముగ విశ్వమును రూపొందించు శక్తియే క్రియాశక్తి. ఇట్టి క్రియాశక్తి విశ్వసృష్టి కొఱకు స్వవ్యాపారములతో పంచకృత్యముల నిర్వహించుచున్నది. ఈ యిచ్ఛాశక్తియే శ్రీదేవియొక్క తాత్త్వికరూపము ఆని తాంత్రిక గ్రంథములు చెప్పుచున్నవి. ఇచ్ఛాకామసంకల్ప పదములు సమానార్థకములు. కావున కామాత్మకమగు శక్తిలోగల పరమేశ్వరుడు కామేశ్వరుడు. ఆ శక్తియే కామేశ్వరి. ఈ అంశము దేవీ సప్తశతిలో నిగూఢముగ నున్నది. లలితోపాఖ్యానము- లలితా సహస్రనామ స్తోత్రము మొదలగువానిలో కొంత ప్రకటముగ చెప్పబడినది. జగన్మాత ఇచ్ఛాశక్తి రూపిణి యగుటచే ఆమె ఇచ్ఛా మాత్రముననే యీ వివ్వ మంతయు రూపొందుచున్నది. ఈ అంశములన్నియు శ్రీదేవీ భాగవతములో మహిషాసుర శుంభ నిశుంభాసుర చండ ముండాసుర వధ కథా ప్రసంగములందు శ్రీదేవీగీతయందు ప్రతిపాదితములు. ఇట్టి రహస్యము లెన్నియో యిందు గలవు. పాఠకులీ విషయము తెలిసికొని శ్రీదేవీ భాగవతమును తప్పక చదివి ఆ జగదంబను సేవించి తత్కటాక్ష వివేషమున అనాది సంసారబంధ వినిర్ముక్తులు అగుదురు గాక! ఇట్టి మహోత్కృష్ట పురాణ రాజమును సర్వభక్త జనోపయోగార్థమై సంస్కృత మూలముతో తెనుగు తాత్పర్యముతో ప్రకటించి శ్రీవేంకటేశ్వర ఆర్షభారతీ సంస్థ వారు శ్రీశంకర భగవత్పాద ప్రథమ ప్రతిష్ఠిత శృంగేరీ శ్రీశారదా పీఠాపధితులగు జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహా సన్నిధాన స్వామిపాదులహస్త కమలములందు అంకితము చేయగల్గుట మహాసుకృతము. మా సంస్థచే ముద్రింపబడి ప్రకటింపబడుచున్న ఆర్షభారతీ పురాణ వాఙ్మయమును తప్పక పఠించి పాఠకులు కృతార్థులగుచు మా కృషిని సార్థకము చేయ ప్రార్థన! వేదమాతయగు శ్రీమాత అందఱకు సద్బుద్ధి ననుగ్రహించుగాక! అని కాంక్షించు శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్ట్ పక్షమున బుధజన విధేయులు పాతూరి సీతారామాంజనేయులు ఎం.ఏ. (తెలుగు-సంస్కృతము) విద్వాన్ జంధ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యాకరణ విద్యాప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, వేదాంత విశారద.